టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది బలి

  • టర్కీ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి కాల్పుల కలకలం
  • ఘటనలో 8 మంది విద్యార్థులు, ఒక టీచర్ మృతి
  • నిందితుడైన విద్యార్థి కూడా మరణం, 13 మందికి గాయాలు
  • మాజీ పోలీస్ అయిన తండ్రి తుపాకులతో ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ
టర్కీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల విద్యార్థి తను చదువుకుంటున్న పాఠశాలలోనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది తోటి విద్యార్థులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడైన విద్యార్థి కూడా మరణించాడు. నిన్న కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో ఈ విషాదం జరిగింది.

8వ తరగతి చదువుతున్న ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి, తన తండ్రికి చెందిన ఐదు తుపాకులతో స్కూల్‌లోకి ప్రవేశించాడు. రెండు తరగతి గదుల్లోకి వెళ్లి  కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్త్సీ ధ్రువీకరించారు.

నిందితుడి తండ్రి ఉగుర్ మెర్సిన్లీ మాజీ పోలీస్ అధికారి అని, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, నిందితుడు తనని తాను కాల్చుకున్నాడా? లేక పోలీసుల చేతిలో హతమయ్యాడా? అనే విషయంపై స్పష్టత లేదు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, టర్కీలో రెండు రోజుల వ్యవధిలో స్కూల్ కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Isa Aras Mersinli
Turkey school shooting
Kahramanmaras province
Ayser Calik Middle School
school shooting
gun violence
Mustafa Siftci
Ugur Mersinli
crime news

More Telugu News